లలితార్ధ వ్యాఖ్యాన లహరి

సిడ్నీ (ఆస్ట్రేలియా)లో 2003-08 సంవత్సరాలలో శారదా దేవి పేర నెలకొల్పిన తాత్కాలిక దేవ్యాలయంలో పూజల సందర్భంగా, లలితా సహస్ర నామాలలో ప్రతి నామం యొక్క భావార్ధాలు, “సిడ్నీపురీ శారదా” అనే మకుటంతో, వరుస క్రమంలో, ఒక్కొక్క శ్లోక రూపంలో ఆశువుగా పలికించబడ్డాయి.
ఆ భావార్ధ శ్లోకాల్లోనూ, మూల నామాల్లోను నిగూఢంగా ఉన్న రహస్యార్ధాలు, మంత్ర, తంత్ర, యోగ, వేదాంత విశేషాలను పరిశీలించి, మహనీయుల అనుభవాలను, అనుభూతులను అధ్యయనం చేసి, ఆ విశేషాల్ని “లలితార్ధ సుధా లహరి” పేరున 2020-21లలో ప్రసంగ పరంపరగా, వీడియోలుగా వెలువరించడం జరిగింది.
ఆ ప్రసంగాలలో వివరించిన విషయాల పుస్తక రూపమే ఈ “లలితార్ధ వ్యాఖ్యాన లహరి”. సుమారు వంద నామాలకొక సంపుటంగా, మొత్తం పది సంపుటాలుగా వెలువడుతున్న ఈ వ్యాఖ్యాన లహరిని

అందుకోండి !

ఆనందించండి !!

ఆదరించండి !!!

అందరికీ అందించండి !!!!

 

సిడ్నీ శారదా స్తోత్రమాల

సిడ్నీ శారదా స్తోత్రమాల


మా గురించి

తెలుగు సాహిత్య లహరి - సిడ్నీ (ఆస్ట్రేలియా)

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిలో భాషాభిమానాన్నీ, మాతృభాషా పరిచయాన్నీ పెంచాలనీ, “తీయనైన తెలుగు మనదీ” అనే ఆత్మీయతా భావాన్ని సమాజంలో విస్తృతం చేయాలనీ, తెలుగు భాషను పదికాలాల పాటు నిలబెట్టుకోవాలనీ సంకల్పంతో సిడ్నీ (ఆస్ట్రేలియా)లో 1988 నుండీ ఎన్నో సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.

తెలుగు భాష, సాహిత్యాలలో తీయదనాన్నీ, గొప్పదనాన్నీ అందరికీ పంచడానికి ‘ఉడతాభక్తి’గా మొదలైన చిన్న ఉద్యమం "తెలుగు సాహిత్య లహరి".

మన తెలుగు లోని తీయదనాన్నీ, తెలుగు సాహిత్యంలోని మాధుర్యాన్నీ మరీ మరీ తలచుకొని పులకరించడానికి వేదిక ఈ “తెలుగు సాహిత్య లహరి”.  

ఇవిగో ఆ ప్రయత్నాలు కొన్ని!   

      ○ “తెలుగు పలుకు” తెలుగు సాహిత్య పత్రికను స్థాపించి, నిర్వహించడం (1988-2004)
      ○ “తెలుగు వెన్నెల”, “తెలుగు వసుధ”  ప్రత్యేక సంచికల ప్రచురణ (1993, 1998)
      ○ ఆస్ట్రేలియాలో శతావధాన నిర్వహణ (1998)
      ○ సిడ్నీ శారదా స్తోత్రమాల - లలితా సహస్రనామ భాష్య స్తోత్రం (2003-2008)
      ○ తెలుగు సాహిత్య పర్వాల సమీక్ష - ఉపన్యాస పరంపర (2013-2014)
      ○ పోతన మహాభాగవత సాహిత్య విశేషాలు - ఉపన్యాస లహరి (2016-2018)
      ○ లలితా సహస్రనామ విశేష ప్రసంగాలు, వ్యాఖ్యాన లహరి (2019-2021)
      ○ మహాకవి కాళిదాసు చరిత్ర “భారతీ విలాసము” నాటక రచన (2021)
      ○ తెలుగు, సంస్కృత భాషలలో రచనలు

వీటి వల్ల ఏ కొద్దిమందికైనా, ఏ కొంచెమైనా తెలుగు సాహిత్యంపై అభిరుచీ, తెలుగుదనంపై అభిమానం పెరిగితే - మా ఈ కొద్ది శ్రమ ఫలించినట్లే !

ఈ ప్రయత్నాలు ఇంతతో ఆగిపోరాదనీ, మా ఈ కుప్పిగంతులను స్ఫూర్తిగా తీసుకొని, మరెంతోమంది ఉత్సాహంతో ముందుకొచ్చి ఈ తెలుగు సాహిత్యోద్యమాన్ని నడిపిస్తారని మా విశ్వాసం.

మనందరం కలిసి

      ○ ప్రతి ఇంటా తెలుగు దీపం అఖండంగా వెలిగేటట్లు చూద్దాం !!
      ○ “తీయని తెలుగు మనదీ” అని గర్విద్దాం !!
      ○ తెలుగు (ధ)దనాన్ని పదికాలాల పాటు నిలుపుకుందాం !!!

 

మీ సాహిత్యాభిమాని

తూములూరి (వెంకట సుబ్రహ్మణ్య) శాస్త్రి

 

లలితార్ధ సుధా లహరి

తెలుగుదనంలోని తియ్యదనాన్నీ, తెలుగు సాహిత్యంలోని మాధుర్యాన్నీ తలచుకొని పులకరించడానికీ, తరతరాలకు పంచడానికి తగిన ప్రేరణ, ప్రోత్సాహం కల్పించడమే తెలుగు సాహిత్య లహరి ప్రధాన ఆశయం.

ఆ ఆశయ సాధనలో భాగంగా, లలితా సహస్ర నామముల అంతర్గత సౌందర్యాలను, మంత్ర, వేదాంత రహస్యాలను, శాస్త్ర, సాహిత్య విశేషాలను తెలుగు వారందరికీ అందించాలనే చిన్న ప్రయత్నం ఈ “లలితార్ధ సుధా లహరి”.

సహస్రనామాలన్నిటిలోనూ ప్రసిద్ధి కెక్కి, అత్యంత మహిమాన్వితములై, ఐహిక సుఖ శాంతులతో బాటు, మోక్షమార్గ నిర్దేశనములుగా, వశిన్యాది వాగ్దేవతలతో పలుకబడి, వ్యాసాది మహర్షులచే కీర్తించబడినవీ లలితా సహస్రనామములు.

లలితా సహస్రనామాలు అద్భుతమైన సాహిత్యం, యోగశాస్త్రం, వేదాంతం, మంత్ర శాస్త్రం, జ్యోతిషం, ఇంకా ఎన్నో విశేషాలను రంగరించి కూర్చిన విజ్ఞాన సర్వస్వం.

సిడ్నీ (ఆస్ట్రేలియా)లో 2003-08 సంవత్సరాలలో శారదా దేవి పేర నెలకొల్పిన తాత్కాలిక దేవ్యాలయంలో పూజల సందర్భంగా, లలితా సహస్ర నామాలలో ప్రతి నామం యొక్క భావార్ధాలు, “సిడ్నీపురీ శారదా” అనే మకుటంతో, వరుస క్రమంలో, ఒక్కొక్క శ్లోక రూపంలో ఆశువుగా పలికించబడ్డాయి. వాటిని ఎప్పటికప్పుడు సేకరించి 2010-11 ప్రాంతంలో నాలుగు సంపుటాలుగా, కంప్యూటర్ ముద్రణా సహకారంతో కొద్ది ప్రతులు ముద్రించబడ్డాయి.

ఆ శ్లోకాల అర్ధాలు, అంతర్గత భావాలు తెలిస్తే మరింత బాగుంటుందని తలచి, వాటి మూలనామాలపై ఎందరో మహనీయుల అనుభవాలను, అనుభూతులను అధ్యయనం చేయవలసి వచ్చింది.

ఈ అధ్యయనంలో ప్రోగుచేసుకున్న విశేషాలను, ఈ విషయంపై ఆసక్తి ఉన్న వారందరికీ అందించాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకు క్రియారూపమే ఈ “లలితార్ధ సుధా లహరి” ప్రసంగ ప్రసార సంకలనం.

అక్టోబర్ 2019 నుంచీ క్రమంగా అందిస్తున్న మా ఈ చిన్ని “ఉడతా భక్తి” ఫలాలను మీరంతా 

అందుకోండి !

ఆనందించండి !!

ఆదరించండి !!!

అందరికీ అందించండి !!!!

 

సిడ్నీ శారదా స్తోత్రమాల లలితార్ధ వ్యాఖ్యాన లహరి

చిత్ర లహరి లలితార్ధ ఛాయాచిత్ర లహరి