తెలుగు సాహిత్య లహరి - సిడ్నీ (ఆస్ట్రేలియా)
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిలో భాషాభిమానాన్నీ, మాతృభాషా పరిచయాన్నీ పెంచాలనీ, “తీయనైన తెలుగు మనదీ” అనే ఆత్మీయతా భావాన్ని సమాజంలో విస్తృతం చేయాలనీ, తెలుగు భాషను పదికాలాల పాటు నిలబెట్టుకోవాలనీ సంకల్పంతో సిడ్నీ (ఆస్ట్రేలియా)లో 1988 నుండీ ఎన్నో సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
తెలుగు భాష, సాహిత్యాలలో తీయదనాన్నీ, గొప్పదనాన్నీ అందరికీ పంచడానికి ‘ఉడతాభక్తి’గా మొదలైన చిన్న ఉద్యమం "తెలుగు సాహిత్య లహరి".
మన తెలుగు లోని తీయదనాన్నీ, తెలుగు సాహిత్యంలోని మాధుర్యాన్నీ మరీ మరీ తలచుకొని పులకరించడానికి వేదిక ఈ “తెలుగు సాహిత్య లహరి”.
ఇవిగో ఆ ప్రయత్నాలు కొన్ని!
○ “తెలుగు పలుకు” తెలుగు సాహిత్య పత్రికను స్థాపించి, నిర్వహించడం (1988-2004)
○ “తెలుగు వెన్నెల”, “తెలుగు వసుధ” ప్రత్యేక సంచికల ప్రచురణ (1993, 1998)
○ ఆస్ట్రేలియాలో శతావధాన నిర్వహణ (1998)
○ సిడ్నీ శారదా స్తోత్రమాల - లలితా సహస్రనామ భాష్య స్తోత్రం (2003-2008)
○ తెలుగు సాహిత్య పర్వాల సమీక్ష - ఉపన్యాస పరంపర (2013-2014)
○ పోతన మహాభాగవత సాహిత్య విశేషాలు - ఉపన్యాస లహరి (2016-2018)
○ లలితా సహస్రనామ విశేష ప్రసంగాలు, వ్యాఖ్యాన లహరి (2019-2021)
○ మహాకవి కాళిదాసు చరిత్ర “భారతీ విలాసము” నాటక రచన (2021)
○ తెలుగు, సంస్కృత భాషలలో రచనలు
వీటి వల్ల ఏ కొద్దిమందికైనా, ఏ కొంచెమైనా తెలుగు సాహిత్యంపై అభిరుచీ, తెలుగుదనంపై అభిమానం పెరిగితే - మా ఈ కొద్ది శ్రమ ఫలించినట్లే !
ఈ ప్రయత్నాలు ఇంతతో ఆగిపోరాదనీ, మా ఈ కుప్పిగంతులను స్ఫూర్తిగా తీసుకొని, మరెంతోమంది ఉత్సాహంతో ముందుకొచ్చి ఈ తెలుగు సాహిత్యోద్యమాన్ని నడిపిస్తారని మా విశ్వాసం.
మనందరం కలిసి
○ ప్రతి ఇంటా తెలుగు దీపం అఖండంగా వెలిగేటట్లు చూద్దాం !!
○ “తీయని తెలుగు మనదీ” అని గర్విద్దాం !!
○ తెలుగు (ధ)దనాన్ని పదికాలాల పాటు నిలుపుకుందాం !!!
మీ సాహిత్యాభిమాని