తెలుగుదనంలోని తియ్యదనాన్నీ, తెలుగు సాహిత్యంలోని మాధుర్యాన్నీ తలచుకొని పులకరించడానికీ, తరతరాలకు పంచడానికి తగిన ప్రేరణ, ప్రోత్సాహం కల్పించడమే తెలుగు సాహిత్య లహరి ప్రధాన ఆశయం.
ఆ ఆశయ సాధనలో మొదటి మెట్టుగా, 2013-2014లలో తెలుగు సాహిత్య చరిత్రలోని పర్వాలను, ఆ కాలాల్లో వెలసిన కవులను, వారి సాహిత్య కృషినీ తెలుపుతూ తొమ్మిది కార్యక్రమాలు నిర్వహించాం.
వాటిని నిండు మనసుతో ఆదరించి, ఆశీర్వదించారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో సాహిత్యాభిమానులు -- మీ అందరికీ, మీ నిండు గుండెల్లో తొణికిసలాడే భాషాభిమానానికీ కృతజ్ఞతాభివందనములు.
అప్పటినుంచీ, మరింత విలువైన సాహిత్యకార్యక్రమాలను అందించాలన్న సంకల్పం మీ దీవెనల చలవే!
తెలుగు సాహిత్యంలో మకుటాయమానంగా నిలిచిన ఆంధ్రమహాభాగవతంలోని మకరందాలను, సాహిత్య విశేషాలనూ, అందచందాలను అందరికీ అందించే “భాగవత సుధా లహరి” ఇదిగో!!
పోతన్న కలంలోనుంచి వెలువడిన కమ్మని కమనీయ కవితా స్రవంతిలో పొంగిపొర్లిన తెలుగు తేనెల తీయదనం మీకందిస్తోంది “భాగవత సుధా లహరి”.
అందుకోండి !
ఆనందించండి !!
ఆదరించండి !!!
అందరికీ అందించండి !!!!
సీ. కైవల్య పదముకై, కైమోడ్పు కైసేసి
కైవారముల నిచ్చు కైత విరులు
శూలికైనను, తమ్మిచూలికైనను చిత్ర
మగు కధా సువిధాన మధురిమములు
మందార మకరంద మాధురీ రసఝరుల్
సుందరంబుగ పారు సోయగములు
జన్మ సాఫల్యంబు, జన్మ రాహిత్యంబు
ఫలియించి తరియించు పాదపములు
గీ. శివుని పూజించి, హరి భక్తి చిత్తమందు
నిలిపి, దయయును, సత్యంబు, నెరపు నీతి
గోరుముద్దల తినిపించె, కోటి పుణ్య
పేటి! బమ్మెర పోతన మేటి వాణి!!