లలితార్ధ సుధా లహరి

తెలుగుదనంలోని తియ్యదనాన్నీ, తెలుగు సాహిత్యంలోని మాధుర్యాన్నీ తలచుకొని పులకరించడానికీ, తరతరాలకు పంచడానికి తగిన ప్రేరణ, ప్రోత్సాహం కల్పించడమే తెలుగు సాహిత్య లహరి ప్రధాన ఆశయం.

ఆ ఆశయ సాధనలో భాగంగా, లలితా సహస్ర నామముల అంతర్గత సౌందర్యాలను, మంత్ర, వేదాంత రహస్యాలను, శాస్త్ర, సాహిత్య విశేషాలను తెలుగు వారందరికీ అందించాలనే చిన్న ప్రయత్నం ఈ “లలితార్ధ సుధా లహరి”.

సహస్రనామాలన్నిటిలోనూ ప్రసిద్ధి కెక్కి, అత్యంత మహిమాన్వితములై, ఐహిక సుఖ శాంతులతో బాటు, మోక్షమార్గ నిర్దేశనములుగా, వశిన్యాది వాగ్దేవతలతో పలుకబడి, వ్యాసాది మహర్షులచే కీర్తించబడినవీ లలితా సహస్రనామములు.

లలితా సహస్రనామాలు అద్భుతమైన సాహిత్యం, యోగశాస్త్రం, వేదాంతం, మంత్ర శాస్త్రం, జ్యోతిషం, ఇంకా ఎన్నో విశేషాలను రంగరించి కూర్చిన విజ్ఞాన సర్వస్వం.

సిడ్నీ (ఆస్ట్రేలియా)లో 2003-08 సంవత్సరాలలో శారదా దేవి పేర నెలకొల్పిన తాత్కాలిక దేవ్యాలయంలో పూజల సందర్భంగా, లలితా సహస్ర నామాలలో ప్రతి నామం యొక్క భావార్ధాలు, “సిడ్నీపురీ శారదా” అనే మకుటంతో, వరుస క్రమంలో, ఒక్కొక్క శ్లోక రూపంలో ఆశువుగా పలికించబడ్డాయి. వాటిని ఎప్పటికప్పుడు సేకరించి 2010-11 ప్రాంతంలో నాలుగు సంపుటాలుగా, కంప్యూటర్ ముద్రణా సహకారంతో కొద్ది ప్రతులు ముద్రించబడ్డాయి.

ఆ శ్లోకాల అర్ధాలు, అంతర్గత భావాలు తెలిస్తే మరింత బాగుంటుందని తలచి, వాటి మూలనామాలపై ఎందరో మహనీయుల అనుభవాలను, అనుభూతులను అధ్యయనం చేయవలసి వచ్చింది.

ఈ అధ్యయనంలో ప్రోగుచేసుకున్న విశేషాలను, ఈ విషయంపై ఆసక్తి ఉన్న వారందరికీ అందించాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకు క్రియారూపమే ఈ “లలితార్ధ సుధా లహరి” ప్రసంగ ప్రసార సంకలనం.

అక్టోబర్ 2019 నుంచీ క్రమంగా అందిస్తున్న మా ఈ చిన్ని “ఉడతా భక్తి” ఫలాలను మీరంతా 

అందుకోండి !

ఆనందించండి !!

ఆదరించండి !!!

అందరికీ అందించండి !!!!

 

సిడ్నీ శారదా స్తోత్రమాల లలితార్ధ వ్యాఖ్యాన లహరి

చిత్ర లహరి లలితార్ధ ఛాయాచిత్ర లహరి