భాగవత సుధా లహరి - ఛాయాచిత్ర లహరి

భాగవత సుధా లహరి – భాగం-1

సీ. కైవల్య పదముకై,  కైమోడ్పు కైసేసి

కైవారముల నిచ్చు  కైత విరులు

శూలికైనను,  తమ్మిచూలికైనను చిత్ర

మగు కధా సువిధాన మధురిమములు

మందార మకరంద మాధురీ రసఝరుల్

సుందరంబుగ పారు సోయగములు

జన్మ సాఫల్యంబు, జన్మ రాహిత్యంబు

ఫలియించి తరియించు పాదపములు

గీ.   శివుని పూజించి, హరి భక్తి చిత్తమందు

నిలిపి, దయయును, సత్యంబు, నెరపు నీతి

గోరుముద్దల తినిపించె, కోటి పుణ్య

పేటి! బమ్మెర పోతన మేటి వాణి!!

భాగవత సుధా లహరి - భాగం 2

సీ. పరుడె ఈశుండను పరతత్త్వమును నిల్పి

తపమాచరించిరి ధన్యులిచట!

ధర్మమ్ము కాయుచో ధరణి నిల్చెడినన్న

పట్టుతో నేలిరి ప్రభువులిచట!

భక్తితో కొల్చిన పరమార్థమదె వచ్చు

నని నమ్మి నడచిరి నరులు ఇచట!

భగవదవతారముల్ పరిపరి వీక్షించి

తరియించినవి గిరుల్ తరువులిచట!

గీ. హరి పదాంభోజ చింతనాభరితులైన

జీవజాలంబులెల్ల సంజీవ దైవ

భావనా ప్రభా భాస సంభావ్యులైరి!

సురలు అచ్చెరువంది రసూయ మీర!!

భాగవత సుధా లహరి - భాగం 3

సీ. తాపత్రయము కన్న తపమెంతొ మేలన్న

ధన్యులు నడచిన ధర్మపథము !

తామసి యైనచో తా మసి యౌనని

చాటి చెప్పిన నీతి సార సరము !

జ్ఞానయోగంబుల మానితమౌ ముక్తి

సాధ్యమన్నట్టి సంబోధ్య విధము !

పసితనమ్ముననె తపసితనమ్మును గోర

ధృవతారగా నిల్పు దృఢ  ప్రతిజ్ఞ !

గీ. యుగయుగంబుల మానవ ప్రగతి సుగతి

ధర్మతతి, సాధు వృత్తి, సత్కర్మ నిరతి,

భావ భవ భోగ ప్రాభవాభోగ ప్రతతి

తీర్చు భాగవతోత్తమ దివ్య వాణి!!


భాగవత సుధా లహరి - భాగం 4

సీ. పరతత్త్వ విజ్ఞాన పారంబు సారంబు

వికసించి విరబూయు విరుల వనము

మరణాంతమందైన మాధవు స్మరణతో

ముక్తి నిప్పించిన  మూలధనము

భ్రాంతి మూలకమంచు ప్రాణంబులిచ్చిన

త్యాగమూర్తుల తపో యోగ ఘనము

తామసంబున నీశు తప్పుగా జూచెడు

గర్వాంధమడచిన కరకుదనము

గీ. శాంత సద్గుణ సాత్విక సాధు సత్య

తత్త్వ మర్మజ్ఞ  సద్యోగ  ధర్మ జలధి!

భక్త జనవర పెన్నిధి ! సూక్తి శరధి!

భావ భవభయ హరిణి! భాగవత వాణి!!

భాగవత సుధా లహరి - భాగం 5

సీ. పాంచభౌతిక దేహ భవనంబు నున్నట్టి

దేహి రూపము దెల్పు దివ్యవాణి !

దుర్వార గర్వంబు ఖర్వంబుగా జేసి

సర్వాత్ము జేర్చెడి సదయ వాణి !

మందార మకరంద మాధుర్య తూర్యముల్

విశ్వమంతట వీచి వెలయు వాణి !

సందేహమే లేదు సర్వంబు హరియన్న

కాచి యక్కున జేర్చు కరుణ వాణి !

గీ. వైరి చిత్తంబు, దానిని వశము జేయ

విమల సామ్రాజ్యమన్నట్టి యమర వాణి !

అంబుజోదర దివ్య పాదారవింద

భావనామృత పాణి! భాగవత వాణి !!

భాగవత సుధా లహరి - భాగం 6

సీ. కలడొ లేడో యన్న కలవరంబును బాపి

కలడని చూపిన కలిమి కలిమి

ఆమూల వనములో అలివేణితో నుండి

భక్తుని కాచుకై పరుగు పరుగు

భామ కొంగును చేత పట్టితి నన్నట్టి

మాటయే లేనట్టి మరపు మరపు

ఎక్కడికేగునో? ఏమేమి చేయునో?

అంతుపట్టక పోవు అలుపు సొలుపు

గీ. అడిగినను చెప్పడో యని యడుగ నుడుగు

శరణు వేడగ గాచెడి కరుణ సరణి

కరి మకరి జీవనంబులె దరికి జేర్చు

పారమార్ధిక సారంబు భాగవతము!!


భాగవత సుధా లహరి - భాగం 7

సీ. ఒదిగి యుండిన నెంతొ ఎదుగ వచ్చును, దాన

కొదవ లేదని చెప్పె కుఱ్ఱ వడుగు

ఇహలోకమంతయు ఇంతమాత్రమె, దాన

మోహంబు వలదన్న మొదటి యడుగు

పైలోకములలోన పస లేదు, యవి నిల్వ

లేవని దెల్పు రెండవది యడుగు

లోలోకమందలి లోభ యహంకృతుల్

చేవ యణచెడి మూడవది యడుగు

గీ. సంపదలు వైభవంబులశాశ్వతములు

పలికి లేదనుకంటె పాపంబు లేదు

అర్ధికిచ్చిన దానంబె సార్ధకమని

బ్రతుకు పరమార్ధమిచ్చిన భాగవతము!!

భాగవత సుధా లహరి - భాగం 8

సీ. అఖిలాత్ముడైనట్టి హరిని భక్తితొ గొల్వ

ఆపదల్ రావన్న అర్ధ సహిత!

పట్టుబట్టి పరమపావని గంగను

దివినుండి భువికిని తెచ్చు ఘనత!

ధర్మపాలన యందు కర్మ సాధన యందు

మేటి ఔ రాజుల మేల్మి సమత!

పస్తులుండియునైన పరుల యాకలి దీర్చు

వితరణ శీలుల విమల చరిత!

గీ. సత్య సాత్త్విక సౌజన్య సాధువృత్తి

దాన ధార్మిక సువిధాన దయ ప్రవృత్తి

ఘోర సంసార దుఃఖాబ్ధి దరికి జేర్చు

కమ్ర భక్తి ప్రభావ భాగవత విదిత!!

భాగవత సుధా లహరి - భాగం 9

సీ. పుట్టువే ఎరుగని పురుషుని లాలించి

కులికెను యాదవ కలికి కులము!

ఆకులంబులు లేక గోకులంబును గావ

వ్యాకులంబును బాసె గోకులంబు!

జగముల నాడించు జగజెట్టితో యాడి

పాడెను గోపాల బాల కులము!

జీవరాశుల గాచు చిద్విలాసుని జూచి

తలలూచె యాలమందల కులంబు!

గీ. ఏమి నోములు నోచెనో ఈశు తోడ

ఆడిపాడగ వ్రేపల్లె వాడ వాడ!

కసరు విసరుల దండన ఖాదనముల

విశ్వమును జూచి పులకించె విశ్వమంత!!


భాగవత సుధా లహరి - భాగం 10

సీ. సిరికైన శ్రుతికైన చిక్కని బ్రహ్మము

గొల్లెతచే కట్ట  కొంటెతనము

మీగడ పెరుగుతో మేళవించిన చల్ది

యాగ భోగము మించు రాగతనము

గోపాల గోవత్స రూపముల్ తన మాయ

జాలమంచును తెల్పు జాణతనము

కాళీయ ఫణిఫణా కమనీయ వేదిపై

క్రీడతో నర్తించు వాడితనము

గీ. బాల గోపాల లీలతో బ్రహ్మ నైన

వెరగు పరచిన మురిపెంపు గరువ తనము

కలకలంబును రేపిన చిలిపి తనము

దరికి జేర్చు భాగవత నిధాన ధనము!!

భాగవత సుధా లహరి - భాగం 11

సీ. గోగోప బాలుర కూర్మితో రక్షింప

దావాగ్ని మ్రింగిన తరుణ వర్తి

విలువల నిలువంత విలువంత రంగంబు

లంత తాననెడు అద్వైత మూర్తి

గోవర్ధనంబును గోవర్ధనమునకై

పదనుగా నెత్తిన సదయ మూర్తి

సనకాది మునియోగి సన్నుత పాదముల్

తలపుల నింపిన తరళ కీర్తి

గీ. చెట్టు పుట్టల చెలికాని పట్టుకొరకు

వెదకి వేసారి అలసిన విరహ మహిత   

మానసాంతర వాస సన్మాన మూర్తి

భరిత విస్ఫూర్తి సత్కీర్తి భాగవతము!!

భాగవత సుధా లహరి - భాగం 12

సీ. తలపుల వలపుల పులకింత లొలికించి

అలరించి పరమిచ్చు పరమ పదము

భక్తి ఆసక్తుల శక్తికి రక్తితో

ముక్తి నిప్పించు అవ్యక్త పదము 

వక్రతలన్నియు విక్రమమ్మున తీర్చి

సక్రమంబుగ కాచు సత్త్వ పదము

శిష్టరక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సం

రక్ష జేసెడి దీక్ష దక్ష పదము

గీ. వెలసి విరిసిన వేదాంత వీధి యందు

మధుర మధురాయమానమౌ సుధల వసుధ

హర్ష వర్ష ప్రహర్ష దుర్ధర్ష  కర్ష

కలిత ముక్తి నిధాన భాగవత పథము!!


భాగవత సుధా లహరి - భాగం 13

సీ. సకల విద్యార్థ విశారదా సారమై

చదువు సంధ్యల నేర్చు జాణతనము

పోరాటమున కెంతొ ఆరాటపడు దుర్జ

నాళిని గూల్చు ప్రజ్ఞాళి ఘనము

ముక్తికై యుగయుగమ్ముల భక్తి కీర్తింప

రక్తి గాచెడు యనురక్తి ధనము

సర్వస్వమర్పించు సందేశమందిన

హృదయమిచ్చెడు దయా సదన మనము

గీ. వినయ విక్రమ విశ్రాంత వీర ధీర

సరస సామర్ధ్య కళ్యాణ భరిత విబుధ

తోషణము లార్త దురితౌఘ శోషణములు

భాగవత సుధా మధురార్ర్ద భాషణములు!!

భాగవత సుధా లహరి - భాగం 14

సీ. అనురాగ భావనల్ వినతాభిభాషణల్

విభుని జేర్చెడి విశ్వ విబుధ కీర్తి

సాహసోపేతమౌ మోహసంభరితమౌ

విహరణోత్సవ రక్తి సహిత వర్తి

సరస సల్లాపముల్ విరస విలాసముల్

రక్తి కల్గించు ధీరత్వ మూర్తి

దుర్వార గర్వంబు ఖర్వంబు గావించి

పర్వంబు చేయు అపూర్వ కీర్తి

గీ.  శైవ వైష్ణవ  శక్తుల దైవమొకటె

హరిహరాత్మక పరబ్రహ్మ హాస భాస

విలస లసిత సిత స్మిత విశ్వవేద

కలిత వేదాంత వీధి! భాగవత జలధి!!

భాగవత సుధా లహరి - భాగం 15

సీ. పదియారు వేలతో భవభోగ లాస్యముల్

భవబంధ రాహిత్య  పరమ పదము!

రాజసూయంబున రాజసూయల త్రెంచి

రాజ సౌఖ్యంబిచ్చు రాజ పదము!

స్నేహంబునకు కాల నియమంబు లేదని

సిరిసంపదలనిచ్చు శీల పదము!

ప్రేమ భావారాధ్య భామాభిరామముల్

సీమా వినోదమౌ శ్రేయ పదము!

గీ.  వేద వేదాంత విజ్ఞాన విదిత వినుత

సారసంబైన గీతార్ధ సౌరభముతొ

పుణ్యభూమిగ జేయు బ్రహ్మణ్య పదము!

కర్మబంధంబు బాపు భాగవత పథము!!